: ‘పోలవరం’తోపాటే విద్యుత్ కేంద్రం కూడా...40 నెలల్లో పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుతోపాటే విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణాన్ని కూడా అదే సమయంలో పూర్తిచేయాలని భావిస్తోంది. మొత్తం 40 నెలల్లో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. యూనిట్ల నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించుకుంది. విద్యుదుత్పత్తి కేంద్రం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మంత్రి దేవినేని ఉమ, జలవనరుల శాఖ అధికారులు, ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్, ఉప కాంట్రాక్ట్ సంస్థలు, ఏపీ జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుపై 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 యూనిట్లు (మొత్తం 960 మెగావాట్లు) నిర్మించేందుకు జెన్కో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని తూర్పు గోదావరి (ఎడమ), పశ్చిమ గోదావరి(కుడి) వైపున నిర్మించనున్నారు. ఈ మొత్తం నిర్మాణాలకు అవసరమయ్యే రూ.4808.80 కోట్ల నిధులను రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్(ఆర్ఈసీ) నుంచి రుణంగా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లో కొన్ని.. * వర్షాకాలంలో గోదావరి నదిలో ఉండే ప్రవాహ ఉద్ధృతిని ఆధారంగా చేసుకుని విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తారు. * మిగులు ప్రవాహం ఆధారంగా 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చంటూ ఏపీ జెన్కో ఇప్పటికే అంచనాలు రూపొందించింది. * 2010-11లో రూపొందించిన ఈ ప్రాజెక్టు డిజైన్‌లకు కేంద్ర విద్యుత్ సంస్థ సాంకేతిక, ఆర్థికపరమైన ఆమోదం తెలిపింది. * ఈ ప్రాజెక్టు వల్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రక్షణ శాఖ సైతం ధ్రువీకరించింది. * జలవిద్యుత్ కేంద్రాన్ని ఏపీ జెన్కోనే నిర్మించాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News