: ఇకపై ఎమ్మార్వోను తహశీల్దారు అని పిలవండి: కేసీఆర్
కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ బాగా మారాల్సి ఉందని... సిటిజన్ చాప్టర్ అమలు చేసి, అవినీతి రహిత పాలనను అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో)ని ఇకపై తహశీల్దారు అనే పిలవాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పాలనా విభాగాలు పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ ఈ రోజు కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో, అన్ని జిల్లాల్లో ఒకే తరహా విభాగాలు, ఉద్యోగుల సంఖ్య అవసరం లేదని కేసీఆర్ తెలిపారు. అవసరమైన చోటే సంబంధిత శాఖల కార్యకలాపాలు అధికంగా ఉండాలని సూచించారు. పరిపాలనా విభాగాలను అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించాలని చెప్పారు. మధ్యప్రదేశ్ లో సోమేష్ కుమార్, ఉత్తరప్రదేశ్ లో ఎస్కే జోషి, తమిళనాడులో అజయ్ మిశ్రా, బీహార్ లో ఎస్పీ సింగ్, హర్యాణాలో నవీన్ మిట్టల్, చత్తీస్ గఢ్ లో బీఆర్ మీనా పర్యటిస్తారని తెలిపారు.