: పాక్ పై భారత్ దాడులను సమర్థించిన జర్మనీ
పాకిస్థాన్ పై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ఇప్పటికే కొన్ని దేశాలు సమర్థించగా, తాజాగా జర్మనీ కూడా ఆ జాబితాలో చేరింది. ఏ దేశానికైనా తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉంటుందని జర్మనీ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ ఉగ్రవాదమైనా, స్థానిక ఉగ్రవాదమైనా... దేశ భద్రతకు సమస్యగా పరిణమించినప్పుడు దాడులు చేయాల్సిందే అని తెలిపింది. ఈ విషయాన్ని భారత్ లో జర్మనీ రాయబారి మార్టిన్ నే స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి భారత బలగాలు చొచ్చుకుపోయి, సర్జికల్ దాడులు నిర్వహించడాన్ని జర్మనీ సమర్థిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా చెప్పారు. ఏ దేశమైనా మరో దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రవేశించనివ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని మార్టిన్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన దేశానికి ఇతర ఏ దేశమైనా ఉగ్రవాద రూపంలో హాని తలపెట్టినప్పుడు... తన భూభాగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానికి ఉంటుందని తెలిపారు. ఇవి కేవలం తాను చెబుతున్న మాటలు కావని... అంతర్జాతీయ న్యాయ సమాజం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని చెప్పారు. భారత్ తో జర్మనీకి వ్యూహాత్మక ఒప్పందాలు ఉన్నాయని... తమ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్, భారత ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే క్రమంలో భారత్ తో కలసి తాము పని చేస్తామని చెప్పారు. భారత్ తో తమ బంధం సామాన్యమైనది కాదని, చాలా దృఢమైనదని తెలిపారు.