: తమిళనాడులో 30 మంది యువతులను మోసం చేసిన పాస్టర్!
మతం ముసుగులో ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి మాయమాటలతో 30 మంది యువతులను మోసం చేసిన ఘనుడిని తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా శంకరనకోయిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... రామనాథపురం సాయల్ కుడి గ్రామ చర్చి పాస్టర్ గా మిలనసింగ్ (46) పని చేస్తుండేవాడు. మతం ముసుగులో మాయమాటలు చెప్పిన మిలనసింగ్ ఆరు నెలల క్రితం పాళయంకోటకు చెందిన కాంతిమతి (30) అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమె నుంచి 5 లక్షల రూపాయలు, నగలు తీసుకున్నాడు. ఆమె ఒత్తిడి చేయడంతో ఉద్యోగం కోసం పెద్దలను కలవాలంటూ కారులో తీసుకెళ్లి, కదులుతున్న కారులోంచి ఆమెను కిందికి తోసేశాడు. దీంతో గాయపడ్డ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, కేసు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ కామాంధుడు మతం ముసుగులో సుమారు 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాలకు అతని భార్య జీవిత కూడా సహకరించడం విశేషం. అతని చేతిలో మోసపోయిన వారిలో అన్బుసెల్వం (24) అనే యువతి గర్భందాల్చడంతో తనను కూడా వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను సజీవదహనం చేశాడు.