: నా ఛాతీ కొలతలపై మీరెందుకు మాట్లాడతారు?: మంత్రులపై మోదీ అసహనం
పీఓకేలో సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత ప్రధాని మోదీ ఛాతీ 100 అంగుళాలకు పెరిగిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. నేడు క్యాబినెట్ భేటీ జరిగిన వేళ, దాడులకు సంబంధించి ఇష్టానుసారం మాట్లాడుతున్న పలువురు కేంద్ర మంత్రుల వైఖరిపై ఆయన బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. వీడియో ఫుటేజ్ సైన్యానికి సంబంధించినదని వ్యాఖ్యానించిన ఆయన, వాటిని విడుదల చేయాలని భావిస్తే, సైన్యమే భారతావనికి చూపుతుందని స్పష్టం చేశారు. ఇకపై బీజేపీ నేతలెవరూ ఈ విషయంపై ప్రకటనలు చేయరాదని ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్ లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు.