: మాపై చంద్రబాబు సర్కారు నిఘా పెట్టింది: దాసరి, ముద్రగడ
కాపులకు రిజర్వేషన్లు దక్కాలన్న ఏకైక లక్ష్యంతో తాము నిరంతరమూ శ్రమిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని దర్శకుడు దాసరి నారాయణరావు, మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో తాము సమావేశమైతే, ఈ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్నీ ఏపీ ప్రభుత్వం తీసుకు వెళ్లిందని ఆరోపించారు. ప్రభుత్వానికి తాము భయపడేది లేదని స్పష్టం చేసిన ముద్రగడ, రిజర్వేషన్ల కోసం మరింత ఒత్తిడి తేవాలనే నిర్ణయించామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడం వల్లే తాము ఉద్యమంలో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించామని ముద్రగడ తెలిపారు. కాపులను రిజర్వేషన్ల కోసం రోడ్ల మీదకు తెచ్చింది చంద్రబాబేనని ఆరోపించిన ఆయన, పాదయాత్ర చేపట్టాలా? లేక సత్యాగ్రహం చేయాలా? అన్న విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.