: కడుపు నింపుకునేందుకు ఎన్నో పాట్లు పడుతున్నాం.. ఇంకెంత కాలం ఇలా?: సరిహద్దు ప్రాంతాల ప్రజల ఆవేదన
యూరీ దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖను దాటి పీవోకేలో భారత సైన్యం చేసిన దాడులతో భారత్, పాకిస్థాన్‌ల సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ దాడి చేస్తే ఊరుకునేది లేదని తిప్పికొట్టి గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సుమారు పదికిలోమీటర్ల మేర తమ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం తమ ప్రాంతాలను విడిచి వెళ్లలేక అక్కడే నివసిస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. విద్యాసంస్థలు కూడా మూతపడటంతో విద్యార్థుల భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది. ఇంకెంత కాలం ఇలా బతకాలని సరిహద్దు ప్రాంతాల ప్రజలు మీడియాతో తమ గోడు చెప్పుకున్నారు. తమ ప్రాంతాలను వదిలి బంధువుల నివాసాల వద్ద ఎంతకాలం ఉండాలని అడుగుతున్నారు. తమలో ఎంతో మంది కట్టుబట్టలతోనే బయటకొచ్చినట్లు చెబుతున్నారు. కడుపు నింపుకోవడానికి ఎన్నో పాట్లు పడుతున్నట్లు చెప్పారు. ఇళ్ల వద్దనే తమ పశువులను వదిలేసి, తాము ఇతర ప్రాంతాలకి తరలివచ్చినట్లు చెప్పారు. తాము పెంచుకునే పశువుల పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకురావాలని అంటున్నారు.