: ఉద్యోగం ఊడిపోయే ప్రమాదంలో 69 శాతం మంది భారతీయులు: ప్రపంచబ్యాంకు


అన్ని రంగాల్లోని చిన్నా, పెద్ద కంపెనీలు యాంత్రీకరణ (ఆటోమేషన్) బాట పడుతున్న వేళ, ఇండియాలో 69 శాతం మంది ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో ఉన్నట్టేనని వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అందివస్తున్న సాంకేతికత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక గమనాన్ని మార్చివేయనుందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ కిమ్ వెల్లడించారు. కాగా, చైనాతో పోలిస్తే మాత్రం ఇండియాలో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకునే వారి అంచనా సంఖ్య తక్కువగానే ఉంది. చైనాలో 77 శాతం మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతున్నట్టేనని ఈ నివేదిక తెలిపింది. "వృద్ధి రేటును పెంచేందుకు మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. ఇదే సమయంలో ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం? వాటితో భవిష్యత్తులో వచ్చే చిక్కులేంటి? అన్న విషయాలపైనా దృష్టిని సారించాల్సి వుంది. ప్రపంచాన్ని సమూలంగా మార్చేది సాంకేతికతే అన్న అంశాన్ని మాత్రం మరవరాదు" అని జిమ్ కిమ్ తెలిపారు. "సంప్రదాయ అభివృద్ధి విధానమైన వ్యవసాయ దిగుబడి పెంపు, ఆపై ఉత్పత్తి రంగం, పారిశ్రామికీకరణ పద్ధతి అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకూ ప్రస్తుత పరిస్థితుల్లో సరిపడదు" అని ఆయన అన్నారు. ఆఫ్రికాలో కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత సంప్రదాయ పద్ధతిని మారుస్తోందని వివరించారు. ఆటోమేషన్ కారణంగా ఇథియోపియాలో 85 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.

  • Loading...

More Telugu News