: షోపియాన్లో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన ఉగ్రవాదులు
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని భారత సైన్యం ఎన్కౌంటర్ చేసిన తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఆ ఆందోళనలను అదునుగా చూసుకుంటున్న ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తరుచుగా దాడులకు దిగుతున్నారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూడా మోహరింపజేసినప్పటికీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఆ రాష్ట్రంలోని షోపియాన్లో ఎమ్మెల్యే మహమ్మద్ యూసఫ్ భట్ ఇంటిపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.