: అమెరికా కోసం ఖాతాదారుల ఈ-మెయిల్స్ ను రహస్యంగా తెరచి చూస్తున్న యాహూ
అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు, ఖాతాదారుల ఈ-మెయిల్ ఖాతాలకు వచ్చే సమాచారాన్ని తెరచి చూసేందుకు యాహూ గత సంవత్సరం ఓ సాఫ్ట్ వేర్ ను తయారుచేసిందని, దీని సాయంతో రహస్యంగా అన్ని యాహూ మెయిల్ ఖాతాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, ఎఫ్బీఐ అధికారుల కోసం యాహూ ఈ పని చేస్తోందని సంస్థను వీడిన ముగ్గురు ఉద్యోగులు వెల్లడించారు. అధికారులు చెప్పిన కొన్ని పదాలు, సంకేతాల కోసం యాహూ యూజర్లకు వస్తున్న మెయిల్స్ మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ సాయంతో స్కాన్ అవుతున్నాయని, అప్పటికే స్టోర్ అయివున్న మెసేజ్ లను స్కానింగ్ చేయడం లేదని వివరించారు. కొన్ని ఎంపిక చేసిన ఖాతాలపై పూర్తి నిఘా ఉంచేందుకూ యాహూ అంగీకరించలేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఇంటెలిజెన్స్ అధికారులకు ఉపకరించేలా యాహూ రహస్యంగా ఏదైనా సమాచారం సేకరించిందా? సేకరిస్తే, దాన్ని ఎఫ్బీఐకి అందించిందా? అన్న విషయం తెలియలేదు. ఇక మిగతా ఈ-మెయిల్ సేవల సంస్థలైన గూగుల్, రెడిఫ్ వంటి సంస్థలనూ ఇలాగే నిఘా వర్గాలు కోరాయా? అన్నది తెలియాల్సివుంది.