: 'పండగ' చేసుకుంటున్న ఈ-కామర్స్ సంస్థలు... తొలి రోజే 1400 కోట్ల బేరం!
భారత్ లో ఈ-కామర్స్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఈ- కామర్స్ వెబ్ సైట్లు వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రతి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆన్ లైన్ లో ఆఫర్లు సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ- కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ సేల్ ను ప్రారంభించాయి. ఇందులో భారత్ లో విశేషమైన ఈ కామర్స్ వాటా కలిగిన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ తొలిరోజు అమ్మకాలు రికార్డులు బద్దలుకొట్టాయి. తొలిరోజు ఏకంగా 1400 కోట్ల రూపాయల అమ్మకాలను జరిపింది. దీంతో తన పోటీదారుల కంటే ముందుకు దూసుకుపోయింది. గతేడాది సాధించిన అమ్మకాల కంటే ఈ అమ్మకాలు రెట్టింపు కావడం విశేషం. ఈ సారి వెయ్యి కోట్ల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా నిర్ణయించుకోగా, అనూహ్యంగా 1400 కోట్ల రూపాయల అమ్మకాలు తొలిరోజే సాగించడం పట్ల ఫ్లిప్ కార్ట్ హర్షం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం ఆన్ లైన్ లో కేవలం పుస్తకాల అమ్మకాలతో ఈ కామర్స్ వ్యాపారంలో అడుగుపెట్టిన ఫ్లిప్ కార్ట్ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగింది. ఈ రోజు భారతీయ ఈ కామర్స్ మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్ వాటా మెజారిటీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజా అమ్మకాలతో ఫ్లిప్ కార్ట్ తొలిసారి ఒక్క రోజులో వెయ్యి కోట్ల రూపాయల మార్కును దాటడంతో పాటు, ఈ రికార్డు ఇంతవరకు మరే రిటైలర్ కు సాధ్యం కాలేదని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. దసరా, దీపావళి సీజన్ లో కొనుగోళ్లు ఊపందుకుంటాయి. ఆయుధ పూజను పురస్కరించుకుని భారతీయులు పలు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దీంతో ఈ కామర్స్ ఆఫర్లు ప్రకటించిన ఐదు రోజుల్లో మొత్తం అమ్మకాలు 12 వేల కోట్లు ఉంటాయని ఈ కామర్స్ రంగం అంచనా వేయగా, ఫ్లిప్ కార్ట్ రికార్డులు కొల్లగొట్టింది. కాగా, గత ఏడాది ఇదే సీజన్ లో మొత్తం ఈ మార్కెట్ వ్యాపారం సాగించిన అమ్మకాలు కేవలం 7 వేల కోట్ల రూపాయలు కావడం విశేషం.