: ఆర్బీఐ బూస్ట్... చివరి గంటలో భారీ కొనుగోళ్లతో ఇన్వెస్టర్లకు రూ. 60 వేల కోట్ల లాభం
ఉదయం నుంచి స్తబ్ధుగా సాగుతున్న భారత స్టాక్ మార్కెట్ సూచికలకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి క్రితం ముగింపు వద్దే ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలు రెపో రేటును తగ్గిస్తూ, ఆర్బీఐ నిర్ణయం వెలువడిన నిమిషాల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లాయి. బ్రాడర్ మార్కెట్ తో పోలిస్తే చిన్న, మధ్య తరహా కంపెనీల ఈక్విటీలకు మంచి కొనుగోలు డిమాండ్ కనిపించింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 60 వేల కోట్లకు పైగా పెరిగింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 91.26 పాయింట్లు పెరిగి, 0.32 శాతం లాభంతో 28,334.55 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 31.05 పాయింట్లు పెరిగి 0.36 శాతం లాభంతో 8,769.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.50 శాతం, స్మాల్ కాప్ 0.66 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 34 కంపెనీలు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, గెయిల్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, జడ్ఈఈఎల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,977 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,688 కంపెనీలు లాభాలను, 1,154 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో సోమవారం నాడు రూ. 1,12,93,400 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,13,57,485 కోట్లకు పెరిగింది.