: చనిపోయిన భారత సైనికుల గురించిన ప్రశ్నపై ఓంపురి షాకింగ్ సమాధానం!
ఉరీ, బారాముల్లాలలో ఇటీవల జరిగిన సంఘటనలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనల్లో చనిపోయిన సైనికులను ఆర్మీలో చేరమని, ఆయుధం పట్టమని వారిని ఎవరూ అడగలేదంటూ వ్యాఖ్యానించారు. ఒక జాతీయ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో ఆయన ఈవిధమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని పాక్ నటులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలపై ఓంపురిని ప్రశ్నించగా.. శతాబ్దాలుగా కొట్టుకుంటున్న ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల్లా భారత్-పాక్ ను చూడాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇది దేశాలు విడిపోయే విషయం కాదు, కుటుంబాలు విడిపోయే విషయమని, ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఉందని, ఇప్పటికీ తాను పాక్ నటులతో కలిసి పనిచేస్తానని ఓంపురి ఆ చర్చలో స్పష్టం చేశారు.