: కేసీఆర్‌ను చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆయన ఈరోజు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీయలేకపోతున్నారని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోందని, గోదావరిపై కేసీఆర్ ప్రాజెక్టులను మొదలుపెట్టారని ఆయన అన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి, అక్కడి నుంచి నీరు తన్నుకొని పోతోంటే కనీసం అడిగే పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు లేరని జగన్ మండిపడ్డారు. రైతులు నకిలీ విత్తనాల ద్వారా ఎంతో మోసపోయారని జగన్ అన్నారు. దానిపై కూడా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీకు వచ్చిందా?.. అని ఆయన రైతులను ప్రశ్నించారు. ‘రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నారు.. రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. కనీసం మీ వడ్డీలయినా తీరాయా?’ అని ప్రశ్నించారు. ‘కరవు ఏర్పడి రైతులు అష్టకష్టాలూ పడుతోంటే.. మరోవైపు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే అంటూ హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఏరియల్ సర్వే కాదు చేయాల్సింది.. కరవు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, రైతులతో చర్చించి కష్టాలను అడిగి తెలుసుకోవాలి. వరదలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉండదు. అటువంటప్పుడు ఎవరయినా హెలికాప్టర్ ద్వారా పర్యటిస్తారు. కానీ, కరవు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏరియల్ పర్యటన చేస్తున్నారు’ అని జగన్ ఎద్దేవా చేశారు.