: జయలలిత ఆరోగ్యంపై తక్షణమే వైద్య నివేదిక ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. జయ ఆరోగ్య పరిస్థితులను గురించి నిజానిజాలను వెల్లడించాలని చెన్నైకి చెందిన న్యాయవాది ట్రాఫిక్ రామస్వామి నిన్న ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. జయలలిత ఆరోగ్యంపై తక్షణమే వైద్య నివేదిక ఇవ్వాలని చెన్నై వైద్యులకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆసుపత్రి ఎదుట భారీగా జయ అభిమానులు గుమికూడారు. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో సెప్టెంబరు 22వ తేదీన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆమె ప్రజల ముందుకు రాకపోవడంతో తమిళనాడులో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ‘అమ్మ’ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.