: నాడు చుక్క నీటి కోసం పాట్లు.. నేడు వరదతో నిద్ర కరవు.. లాతూర్లో ప్రజల దీనావస్థ
లాతూరు.. ఈ పేరు బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వేసవిలో చుక్క నీటి కోసం ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోయారు. భూములు నోళ్ల తెరిచి ఆకాశం వైపు ఆశగా చూసినా ఫలితం లేకపోయింది. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో స్పందించిన కేంద్రం కొన్ని నెలలపాటు రైళ్ల ద్వారా నీళ్లు సరఫరా చేసింది. అది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. కానీ నేడు అదే లాతూరు ప్రజలు వరదతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజులుగా లాతూరులో పడుతున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎటుచూసిన నీరే. వరదనీరు పోటెత్తుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా లాతూరుకు తాగు, సాగునీరు అందించే మంజరా నదిపై ఉన్న డ్యామ్ నిండుకుండలా కళకళలాడుతోంది. డ్యాం పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు.