: 30 కూడా కాదు 31.. ముసాయిదాలోని 17తో పాటు సిరిసిల్ల, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటు


తెలంగాణలో కొత్త జిల్లాలపై సస్పెన్స్‌కు తెరపడింది. ముందుగా ప్రకటించిన ముసాయిదాలోని 17తో పాటు మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మొదట ప్రకటించిన జిల్లాలతో పాటు సిరిసిల్ల, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్‌లను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీఎం తాజా నిర్ణయంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య పది నుంచి ఎకాఎకిన 31కి చేరుకుంది. దసరా నుంచి కొత్త జిల్లాల ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి తాజా నిర్ణయం ప్రకారం వరంగల్ జిల్లాలో 5, కరీంనగర్‌లో 4, మహబూబ్‌నగర్‌లో 4, ఆదిలాబాద్‌లో 4, మెదక్‌లో 3, రంగారెడ్డిలో 3, నల్గొండలో 3, నిజామాబాద్‌లో 2, ఖమ్మంలో 2, హైదరాబాద్‌లో ఒకటి చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సోమవారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్ పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీల జిల్లా అధ్యక్షులతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలు పండుగ చేసుకోవాలని అన్నారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాగా సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలని, కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. మహబూబాబాద్, వికారాబాద్ పేర్లలో మార్పు ఉండదు.

  • Loading...

More Telugu News