: యూరీ సెక్టార్ నిందితులు పాక్ నుంచి వచ్చారని చెప్పిందే మేము... పాక్ ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే: రష్యా హెచ్చరికలు
ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ ను రష్యా సమర్థించింది. భారత్ లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం.కదకిన్ మాట్లాడుతూ యూరీ సెక్టార్ లో సైనికులను హతమార్చిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు మొట్టమొదట బహిరంగంగా ప్రకటించిన దేశం రష్యాయేనని అన్నారు. భారతదేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మొదటి నుంచి ఈ విషయాన్ని తాము బహిరంగంగానే చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు. ఏ దేశమైనా ఉగ్రవాద చర్యల నుంచి తనను కాపాడుకోవలసిందేనని చెప్పిన ఆయన, భారత్ అదే చేసిందని సర్జికల్ దాడులను సమర్థించారు. భారత్ కు వ్యతిరేకంగా చేపడుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేయాలని పాకిస్థాన్ కు ఆయన సూచించారు. కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ఆరోపిస్తుండటం గురించి అలెగ్జాండర్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన స్పందిస్తూ ‘‘సైనిక స్థావరాలపైన లేదా భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న ప్రజలపైన ఉగ్రవాద దాడులే అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలు. అంతకంటే దారుణమైన మానవహక్కుల ఉల్లంఘనలు ఉండవు' అని ఆయన స్పష్టం చేశారు.