: ‘వాస్తవాలు వెల్లడించాలి’.. జయలలిత ఆరోగ్యంపై మద్రాసు హైకోర్టులో పిటిషన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై మద్రాసు హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలైంది. జయ ఆరోగ్య పరిస్థితులను గురించి వాస్తవాలను వెల్లడించాలని చెన్నైకి చెందిన న్యాయవాది ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్ వేశారు. రేపు ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరపనుంది. గతనెల 22వ తేదీన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతోనే జయలలిత ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు ఆ సమయంలో ప్రకటించారు. 13 రోజులుగా ఆమె ప్రజల ముందుకు రాకపోవడంతో తమిళనాడులో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ముందు, ప్రార్థనాలయాల్లో సర్వమత ప్రార్థనలు జరుపుతున్నారు. ఆసుపత్రిలో ఆమె కోలుకుంటున్నారని, మరికొన్ని రోజుల్లో ఇంటికి వెళతారని అన్నాడీఎంకే వర్గాలు ఈరోజు కూడా ప్రకటించాయి.