: రక్షణ రంగంలోకి అనిల్ అంబానీ... దస్సాల్ట్ ఏవియేషన్ తో జాయింట్ వెంచర్


భారత ప్రైవేటు రక్షణ రంగ విభాగంలో మరో ముఖ్యమైన డీల్ కుదిరింది. అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, రఫాలే యుద్ధ విమానాలను తయారు చేసే దస్సాల్ట్ ఏవియేషన్ లు నేడు కీలకమైన డీల్ పై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా ఓ జాయింట్ వెంచర్ ను 'దస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్' పేరిట ఏర్పాటు చేయనున్నారు. భారత వాయు సేనకు అందించాల్సిన రూ. 22 వేల కోట్ల విలువైన యుద్ధ విమానాల డీల్ కు అడాగ్ సహకరించనుంది. గత నెల 23న 36 రఫాలే ఫైటర్ జట్స్ కొనుగోలుకు భారత్ 7.87 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 59 వేల కోట్లు) విలువైన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు వారాలకు ఇండియాలోని ఓ కంపెనీతో డీల్ ఉంటే, తాము లాభపడవచ్చని భావించిన దస్సాల్ట్ అడాగ్ వైపు మొగ్గు చూపింది. కాగా, భారత రక్షణ రంగం చరిత్రలో ఓ ప్రైవేటు సంస్థ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్ ఇదేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఓ ఆఫ్ సెట్ అగ్రిమెంట్ గా విమానాల తయారీ విడిభాగాలను ఇండియాలో తయారు చేసి, వాటిని ఫ్రాన్స్ కు పంపి అక్కడ అసెంబుల్ చేసి తిరిగి విమానాలను ఇండియాకు పంపాలన్నది ఈ డీల్ ఉద్దేశం. మొత్తం రఫాలేలకు వెచ్చించే రూ. 59 వేల కోట్లలో, ఈ డీల్ తో రూ. 22 వేల కోట్ల వ్యాపారం ఇండియాలోనే జరగనుందని అంచనా. మొత్తం 7 సంవత్సరాల పాటు అమలులో ఉండే డీల్, తుది నియమాలను త్వరలో ఖరారు చేసుకుంటామని అడాగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతకన్నా ముందు డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్)తో చర్చించాల్సి వుందని ఆయన వివరించారు. ఇదిలావుండగా, ఈ డీల్ లో ఎంబీడీఏ, థేల్స్, సాఫ్రాన్ వంటి ఫ్రెంచ్ సంస్థలు కూడా భాగస్వామ్యమై ఉన్నాయి. ప్రధాని ప్రచారం చేస్తున్న మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియాలకు ఈ డీల్ ఎంతో ఉపకరిస్తుందని, ఏరోస్పేస్ సెక్టారులో ఇండియాను మరో మెట్టు ఎక్కిస్తుందని అడాగ్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ప్రపంచ ఏవియేషన్ రంగంలో ప్రముఖ కంపెనీల్లో ఒకటైన దస్సాల్ట్ ఏవియేషన్ తో కుదిరిన ఈ ఒప్పందంతో తనకెంతో ఆనందంగా ఉందని సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News