: నితీశ్ కటారా హత్య కేసులో వెలువడిన సుప్రీం తీర్పు.. ప్రధాన దోషులకు 25 ఏళ్ల జైలుశిక్ష
దేశంలో సంచలనం సృష్టించిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీశ్ కటారా హత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. నిందితులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లకు 25 ఏళ్ల జైలుశిక్ష, వీరికి సహకరించిన సుఖ్ దేవ్ పహిల్వాన్ కు 20 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, నితీశ్, యూపీకి చెందిన డీపీ యాదవ్ కుమార్తె భారతీ యాదవ్ ప్రేమించుకోగా, వీరి ప్రేమను యాదవ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తన సోదరితో నితీశ్ ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయిన వికాస్, విశాల్ లు, తమ మిత్రుడు సుఖ్ దేవ్ సహకారంతో, 2002, ఫిబ్రవరి 16న ఓ వివాహానికి హాజరైన నితీశ్ ను కిడ్నాప్ చేసి, సుత్తితో విచక్షణారహితంగా కొట్టి, డీజిల్ పోసి నిప్పంటించారు. మూడు రోజుల తర్వాత నితీశ్ మృతదేహం జాతీయ రహదారిపై కనిపించడంతో, అప్పటికే తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన నితీశ్ తల్లి, నీలమ్ రక్త నమూనాలు తీసుకుని డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, మృతుడు నితీశ్ అని తేలింది. ఆపై కేసును విచారించిన హైకోర్టు నిందితులకు దీర్ఘకాల జైలుశిక్షలు విధిస్తూ, తీర్పివ్వగా, శిక్ష తగ్గించాలని వారు సుప్రీంను ఆశ్రయించారు. ఇదే సమయంలో ఖైదును మరణదండనగా మార్చాలని మరో పిటిషన్ దాఖలైంది. వీటిని విచారించిన కోర్టు, ఉరిశిక్ష వేయలేమని స్పష్టం చేస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది.