: శ్రీహరికోటలో హై అలర్ట్... జవాన్ల సెలవులు రద్దు
సముద్రం వైపు నుంచి శ్రీహరికోటలోని షార్ (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్) అంతరిక్ష కేంద్రంలోకి చొరబాట్లు ఉండవచ్చన్న అనుమానాలతో హై అలర్ట్ ప్రకటించారు. షార్ కేంద్రాన్ని పహారా కాసే కేంద్ర ప్రాథమిక భద్రతా సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మరోవైపు మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. ద్వీపానికి దక్షిణాన ఉన్న పల్ వేరికాడ్, ఉత్తరాన రాయదొరువు వైపు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గస్తీని ముమ్మరం చేయడంతో పాటు చొరబాటుదారులను గుర్తిస్తే, సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు అధికారులు సూచించారు. షార్ పరిధిలోని అటవీ ప్రాంతంలోనూ కూంబింగ్ చేస్తున్నారు. కాగా, ఇండియా, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రత పెంచినట్టు అధికారులు తెలిపారు.