: వెన్నుపోట్ల వల్ల చాలా నష్టపోయా: పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నేతలందరికన్నా తానే సీనియర్ నని, వెన్నుపోట్ల వల్ల తాను చాలా నష్టపోయానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, డాక్టరో, పోలీసు ఆఫీసరో అవుదామనుకున్నానని, అయితే, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తన ఆవేశం, ఉడుకు రక్తం కారణంగా గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, దీంతో, తన స్థాయికి రావాల్సిన పదవులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రేణుకాచౌదరి, భట్టి విక్రమార్కలతో తనకు ఎటువంటి వైరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను నాయకుడిని కాదని, కార్యకర్తని అని, పార్టీలో ఇప్పటికీ చాలామంది నేతలు అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారని అన్నారు. తెలంగాణ పీసీసీ ఇంకా బాగా స్పీడ్ పెంచాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి స్వయం కృతాపరాధమేనని అన్నారు. పార్టీకి ఎవరైనా నష్టం చేస్తే హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తెలంగాణ పీపీసీ చీఫ్ ను ఎప్పుడవుతానో తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా పొంగులేటి చెప్పారు.