: తెలంగాణ కోసం రాజీనామా చేయలేదు.. గద్వాల కోసం చేస్తారా?: డీకే అరుణ ప్రకటనపై టీఆర్ఎస్ విమర్శల దాడి
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతున్న కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ఈరోజు తాను రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై టీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి ప్రారంభించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ... ఆమె చేస్తున్నవన్నీ నాటకాలేనని అన్నారు. డీకే అరుణకు దమ్ముంటే రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి కాకుండా శాసనసభ స్పీకర్‌కు పంపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమె వెన్నుచూపారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ... తెలంగాణలో వ్యక్తుల కోసం జిల్లాలు ఏర్పాటు కావడం లేదని అన్నారు. పాలనా సౌలభ్యం కోసమే అనే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ఆమె రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే రాజీనామా అంటున్నారని ఆరోపించారు. ఆనాడు తెలంగాణ కోసం ఆమె రాజీనామా చేయలేదని, ఇప్పుడు గద్వాలను జిల్లా చేయాలి అంటూ రాజీనామా ప్రకటన చేయడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. వనపర్తి ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ ప్రాంతాన్ని జిల్లాగా చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలని తమ సర్కారు ఆశించడం లేదని అన్నారు.