: సరిహద్దు గ్రామాల పౌరులలో ధీరత్వం... గ్రామాల్లో తమ పని తాము చేసుకుంటూ కాపలా కాస్తున్న పురుషులు!
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని పది కిలోమీటర్ల మేర గ్రామాలను ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వెనుక భారత్ భారీ వ్యూహముంది. ఇప్పటికే ఇస్రోకు సంబంధించిన శాటిలైట్ల గస్తీని నిశితంగా శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. పాక్ సైనికులు ప్రతీకారం పేరిట దాడికి తెగబడినా, లేదా చొరబడినా భారతీయులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే స్పందించాలంటే సరిహద్దుల్లో భారతీయులు ఉండకపోవడమే మంచిదన్న నిర్ణయానికి ఆర్మీ వచ్చింది. దీంతో సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించింది. దీంతో పంజాబ్ లోని వివిధ గ్రామాలను ప్రజలు ఖాళీ చేశారు. అయితే, దగ్గర్లోని గ్రామాల్లో బంధువుల ఇళ్లలో తమ మహిళలను ఉంచి పగటి పూట పురుషులు వెనుదిరుగుతున్నారు. ఎవడొస్తాడో రానీ చూసుకుందామంటూ సవాలు విసురుతున్నారు. తామంటే వెళ్లిపోగలిగామని, తమ పశువులను తీసుకెళ్లలేకపోయామని వారు చెబుతున్నారు. ప్రభుత్వం తమ చేత ఇళ్లను ఖాళీ చేయించింది కానీ, పునరావాసం కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెంపుడు జంతువులు, పంటపొలాలను కాపాడుకునేందుకు తాము మళ్లీ సరిహద్దు గ్రామాలకు చేరామని తెలిపారు. గ్రామాలన్నీ ఇంచుమించు నిర్మానుష్యంగా మారాయని, అయితే తాము గ్రామాల్లో ఉండడం వల్ల కొత్తవారు ఎవరైనా సంచరిస్తే వెంటనే సాయుధబలగాలకు సమాచారం అందించవచ్చన ఉద్దేశంతో తాము గ్రామాలను వీడడం లేదని వారు తెలిపారు. తాము పుట్టిపెరిగిన ఊళ్లను వదిలి ఇంతవరకు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఎప్పుడూ చోటుచేసుకోలేదని, ఇప్పుడు ఇలా జరగడంతో తాము నిరాశ్రయులమైనట్టు అనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.