: మైసూరులో మొదలైన దసరా సందడి... ఉత్సవాలను ప్రారంభించిన ప్రభుత్వం
రాష్ట్రంలో కరవు పరిస్థితులు, కావేరీ వివాదం ఒకవైపు కొనసాగుతుండగా... మరోవైపు మైసూరులో దసరా ఉత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. చాముండి కొండపై చాముండేశ్వరీ దేవికి ప్రముఖ కవి చెన్నవీర కనావి, సీఎం సిద్ధరామయ్య తదితరులు పూజలు నిర్వహించడం ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. విజయనగర రాజుల కాలం నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని 1610 నుంచి మైసూరు వడయార్ రాజవంశీయులు కొనసాగిస్తూ వస్తున్నారు. నేటి నుంచి పది రోజుల పాటు ఎన్నోరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో చాముండి కొండ, మైసూరు పట్టణం వెలిగిపోనుంది. అయితే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా ఆడంబరాలకు పోకుండా ఉత్సవాలను సాధారణంగానే నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. సంప్రదాయాల విషయంలో రాజీలేకుండా ఉత్సవాలను సాధారణంగా నిర్వహించడం ఇది రెండో ఏడాది అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.