: ఐక్యరాజ్యసమితి నుంచి పాకిస్తాన్ కు మద్దతు లభించలేదు: భారత్
భారత సైన్యం జరిపిన కాల్పుల విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లిన పాకిస్తాన్ అక్కడి నుంచి ఎటువంటి మద్దతు పొందలేకపోయిందని భారత్ పేర్కొంది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను కూడా తోసిపుచ్చింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ అంశంపై స్పందించారు. భారత్, పాక్ నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం పరిశీలిస్తుందన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ వ్యాఖ్యలను అక్బరుద్దీన్ తప్పుబట్టారు. నియంత్రణ రేఖ పొడవునా ఎలాంటి కాల్పుల విరమణ జరగలేదని, సెప్టెంబర్ 29న జరిగింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద శిబిరాలపై దాడి అని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఎవరో ఒకరు పరిశీలన జరపడం ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారిపోవన్నారు.