: ఆలయాలకు నవరాత్రి శోభ... భక్తుల సందడి
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవీ ఆలయాల్లోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల సందడి నెలకొంది. ఆలయాలను చక్కగా ముస్తాబు చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు శనివారం వేకువ జామునే ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణ కవచాలంకృత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివస్తున్నారు. హైదరాబాద్ లోని పెద్దమ్మతల్లి ఆలయంలోనూ సందడి నెలకొంది. అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. వరంగల్ పట్టణంలోని భద్రకాళీ అమ్మవారు సైతం బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. బాసర సరస్వతీ అమ్మవారు శైలిపుత్రిగా దర్శనమిస్తున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భైంసా పట్టణానికి చెందిన జి.రమేష్ అనే భక్తుడు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును విరాళంగా అందించారు.