: మొత్తం వెయ్యి గ్రామాల ప్రజలను తరలిస్తున్న భద్రతా బలగాలు.. విద్యాలయాలు, గురుద్వారలో సైనిక శిబిరాల ఏర్పాటు
ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పాక్ నుంచి దాడులు జరగవచ్చని భారత్ భావిస్తోంది. సరిహద్దులోని ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి భద్రతా బలగాల సాయంతో ప్రజలను తరలించిన పలు రాష్ట్రాలకు కేంద్రం ఈరోజు మరింత స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. మొత్తం వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తోన్న భారత సైనికులు అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో సైనిక శిబిరాల ఏర్పాటు చేసుకుంటున్నారు. పంజాబ్ లో గురుద్వారలోనూ సైనికుల శిబిరాలు ఏర్పాటయ్యాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రకటించిన హై అలర్ట్ కొనసాగుతోంది. పంజాబ్‌లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై, ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై రాజ్‌నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.