: మనోళ్లు మహా ముదుర్లు... సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆ విధంగా ముందు జాగ్రత్త తీసుకున్నారు!
భారత ఆర్మీ చాలా జాగ్రత్తలు తీసుకుని సర్జికల్ స్ట్రయిక్స్ కు దిగింది. ఇతర దేశం భాభాగంపైకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేయాల్సి వస్తే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ దోషిగా నిలవాల్సి వస్తుంది. అదే సమయంలో ఆ దాడి యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. సాహసోపేతమైన నిర్ణయాన్ని చాకచక్యంగా పూర్తి చేసిన ఇండియన్ ఆర్మీ... లక్షిత దాడుల సందర్భంగా చోటుచేసుకున్న ప్రతి క్షణాన్ని రికార్డు చేసింది. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని నిర్ధారణ చేయడం, వారిపై మెరుపుదాడులు చేయడం ఇలా ప్రతి అంశాన్ని వీడియో రూపంలో తెరకెక్కించింది. తమ భూభాగంపై ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని చెప్పడానికి పాకిస్థాన్ అంగీకరించదని, తరువాత సైనిక దాడి జరిగిందని అంగీకరించినా, భారత్ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలిపేందుకు తమ సైన్యంపై భారత్ దాడులు చేసిందని, ఇది సరాసరి యుద్ధానికి దిగడమేనని ఆరోపించే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడే అవకాశం ఇవ్వని భారత ఆర్మీ ఈ తతంగం మొత్తాన్ని వీడియోగా చిత్రీకరించింది. తాము బయలుదేరిన క్షణం నుంచి ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసేంతవరకు జరిగిన మొత్తం దృశ్యాలను రికార్డు చేసింది. అయితే దీనిని ఇంకా విడుదల చేయలేదు. కారణం ఇంకా పాకిస్థాన్ పూర్తి స్థాయిలో స్పందించలేదు. రానున్న మూడు రోజులపాటు పాకిస్థాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని, ఈ సందర్భంగా అవసరాన్ని బట్టి, అవకాశం చూసుకుని భారత్ ఆ వీడియోను రిలీజ్ చేయచ్చు!