: 'మీరు హౌస్ వైఫా... ఇదిగో సిగిరెట్ తాగండి' అంటూ మహిళను వేధించిన ఓలా క్యాబ్ డ్రైవర్
'మీరు హౌస్ వైఫా...ఇంత రాత్రి వేళ బయట తిరుగుతున్నారు... మందు కొడతారా?... ఇదిగో సిగిరెట్ తాగండి' అంటూ ఓలా క్యాబ్ డ్రైవర్ తనను హింసించాడని యువ మహిళా న్యాయవాది సోషల్ మీడియా ద్వారా వాపోయారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...బెంగళూరులోని విట్టల్ మాల్యా రోడ్డు నుంచి హెబ్బల్ లో ఉండే తన నివాసానికి చేరుకునేందుకు ఓలా క్యాబ్ ఎక్కానని ఆమె తెలిపింది. కారు ఎక్కిన దగ్గర్నించి అర్థంపర్థంలేని ప్రశ్నలతో ఓలా డ్రైవర్ విసిగించాడని ఆమె తెలిపింది. అంతటితో ఆగని ఆ వ్యక్తి మీరు హౌస్ వైఫా? మందు కొడతారా? సిగిరెట్ తాగండి అంటూ తనతో బలవంతంగా సిగెట్ తాగించేందుకు ప్రయత్నించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా చేస్తే... కారును హెబ్బల్ కు తీసుకెళ్లకుండా కోడిగెహళ్లి వైపు మళ్లించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసు 25 ఏళ్లు అని, అది పెద్ద వయసు కాదని చెబుతూ ఆ డ్రైవర్ తనను ఇబ్బంది పెట్టాడని ఆమె పేర్కొన్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని బలవంతం చేశాడని, కారు దారి మళ్లించడంతో తన తల్లి, స్నేహితులకు క్యాబ్ వివరాలు మెసేజ్ పంపానని ఆమె వెల్లడించారు. చివరకు ఎలాగోలా బతుకు జీవుడా అంటూ ఇల్లు చేరానని, గత రాత్రి ఓలా క్యాబ్ ప్రయాణం నరకం చూపించిందని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై ఆమె ఓలా యాజమాన్యం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే కనుక డ్రైవర్ పై చర్య తీసుకుంటామని ఓలా కంపెనీ హామీ ఇచ్చింది.