: భారత్ పై ప్రతీకార దాడికి పాక్ వ్యూహం సిద్ధం?
మయన్మార్ లోలా తమపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ (లక్షిత దాడులు)కు దిగితే ఏం చేయాలో పాకిస్థాన్ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. భారత్ లో ఏయే లక్ష్యాలపై దాడి చేయాలి, ఏం చేస్తే భారత సైన్యం తీవ్రంగా నష్టపోతుంది? అని పాకిస్థాన్ కు చెందిన ‘ది న్యూస్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ‘‘భారత్ నుంచి సైనికపరంగా ఏ సవాలు ఎదురైనా తిప్పికొట్టేందుకు పాక్ సర్వసన్నద్ధంగా ఉంది. ఆపరేషన్స్ పరంగా మా ప్రణాళిక సిద్ధమైంది. ఎదురుదాడులకు లక్ష్యాలను ఎంచుకున్నాం. అందుకోసం బలగాలను కూడా కేటాయించాం. పాక్ భూభాగంలో ఎలాంటి వైమానిక దాడినిగానీ, భూతల దాడిని గానీ సహించబోం. ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రయిక్ చేస్తే మేం వెంటనే స్పందిస్తాం’’ అని ఈ దేశ రక్షణ వర్గాలు తెలిపినట్టు పేర్కొంది. పాకిస్థాన్ లోకి దూసుకెళ్లి లక్షిత దాడులు చేశామని భారత్ ప్రకటించిన నేపథ్యంలో, దాడులు జరిగినట్టు పాకిస్థాన్ నిర్ధారించింది. ఈ మేరకు ఖండన ప్రకటనలు కూడా జారీ చేసింది. అయితే ప్రణాళిక, సిబ్బంది, ఆయుధాలు అన్నీ సిద్ధం అని ప్రకటించిన పాకిస్థాన్ ఏ రకంగా దాడికి దిగుతుందో చూడాలని భారత ఆర్మీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రష్యాతో కలిసి పాకిస్థాన్ సైన్యం సంయుక్త విన్యాసాలు నిర్వహించేందుకు పూనుకునే సమయంలో పాకిస్థాన్ ఎలాంటి వ్యూహం అనుసరించనుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.