: రిలయన్స్ జియోను తలదన్నే ఆఫర్ ను ప్రకటించిన ఎయిర్‌టెల్.. ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ కాల్స్ ఇక ఉచితం!


రిలయన్స్ జియో దెబ్బకు తలబొప్పి కట్టిన మొబైల్ నెట్‌వర్క్ దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఇప్పుడు అదే రిలయన్స్‌ను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసింది. పోటీదారులకు దిమ్మదిరిగే ఆఫర్‌ను ప్రకటించనుంది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయంగా అన్ని ఇన్‌కమింగ్స్ కాల్స్ ఇక ఉచితంగా అవుతాయి. అలాగే ఎయిర్‌టెల్ నెంబరును ఏ దేశంలోనైనా వాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఎక్కువ కాల్ చార్జీ, డేటా రీచార్జీలపై ఆందోళన అవసరం లేదని ఈ ప్యాక్ పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగారులందరికీ వస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ ఆఫర్ కింద ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, ఇండియాకు ఉచితంగా మెసేజ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు అన్ని ప్రముఖ దేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు డేటా ప్రయోజనాలు కూడా అందిస్తామని పేర్కొంది. ఈ ప్యాక్ కాలపరిమితి 30 రోజులు అని పేర్కొంది. ఒక్క రోజు మాత్రమే విదేశాల్లో గడిపేవారు వన్‌డే ప్లాన్ కింద 10 డాలర్లు(రూ.649) చెల్లించాలని, నెలకు అయితే 30 రోజుల ప్యాక్ కింద 75 డాలర్లు(రూ.4,999) చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. అలాగే 3జీ డేటా, అపరిమిత ఇన్‌కమింగ్ కాల్స్, ఇండియాకు కాల్స్ చేసుకునేందుకు 400 ఫ్రీ మినిట్స్, ఇండియాకు అపరిమితంగా మెసేజ్‌లు చేసుకునే వెసులుబాటు ఈ ఆఫర్‌లో ప్రకటించనుంది. పది రోజుల కాలవ్యవధితో అందుబాటులో ఉండే 45 డాలర్ల ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. అక్టోబరు మధ్య నుంచి ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎయిర్ టెల్ సిద్ధమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News