: చేజేతులా చంపుకుంటారు... మానవాళి అంతరించిపోక తప్పదు: ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్స్
ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు సహనం కోల్పోతారని, అప్పుడు అణుయుద్ధం సంభవిస్తుందని, పర్యవసానంగా ఈ ప్రపంచంలో మానవాళి అంతరించిపోక తప్పదని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్స్ హెచ్చరించారు. అభివృద్ధి, టెక్నాలజీ పురోగతి కారణంగా రోబోటిక్ యుద్ధాలు, రసాయన దాడులు చోటుచేసుకుంటాయని, తద్వారా మనిషి తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటాడని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో భూమిపై మనిషి మరో వెయ్యేళ్లకు మించి మనుగడ సాగించడం కష్టమేనని ఆయన తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో విశ్వంలో మనిషి మనుగడ కొనసాగాలంటే ఇతర గ్రహాల్లో కాలనీలు నిర్మించుకోవడమే మార్గమని ఆయన చెప్పారు. ఇటీవల విడుదలైన 'హౌ టు మేక్ ఏ స్పేస్ షిప్' అన్న పుస్తకంలో దీని గురించి ఆయన ప్రస్తావించారు. 'ఉన్నపళంగా అణుయుద్ధాలు మొదలైతే, జెనెటికల్ వైరస్, ఇతర ఉత్పాతాల వల్ల భూమిమీద మానవజాతి అనేది లేకుండా పోతుందని నా నమ్మకం' అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఆయన మాటలు నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.