: అభిమానులను నిరాశపరిచిన ‘మీట్ ది దేవ్ గన్స్’
బాలీవుడ్ దంపతులు అజయ్ దేవగణ్, కాజోల్ లు అభిమానులతో కలిసి ముచ్చటించేందుకు ‘మీట్ ది దేవ్ గన్స్’ పేరుతో అమెరికాలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయింది. ఈ టూర్ లో భాగంగా న్యూయార్క్, చికాగో, కాలిఫోర్నియా, సాన్ జోస్ తదితర ప్రాంతాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ కార్యక్రమాలకు హాజరైన అభిమానులతో గంటపాటు ముచ్చటించి, వారితో ఫొటోలు దిగాలన్నది అజయ్, కాజోల్ లు ‘మీట్ ది దేవ్ గన్స్’ నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందం. దీంతో, నిర్వాహకులు ఎక్కువ రేట్లకే ఆయా ప్రాంతాల్లో టికెట్లు అమ్మేశారు. కానీ, అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. ఎందుకంటే, కాలిఫోర్నియా, న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న కాజోల్ తన ఆరోగ్యం బాగుండలేదంటూ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆమె వెంటే భర్త అజయ్ దేవగణ్ కూడా వెళ్లారు. దీంతో, నిరాశచెందిన అభిమానులు నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. ఇక చేసేదేమీలేక, టికెట్ల డబ్బులు తిరిగి వారికి ఇచ్చివేయాల్సి వచ్చింది.