: 'ప్లేబాయ్' మ్యాగజైన్ లో హిజబ్ ధరించిన ముస్లిం మోడల్... తిట్లు, పొగడ్తలు!
ప్లేబాయ్ మేగజైన్... ఈ పేరు వినని వారుండరు. ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ మ్యాగజైన్ గా అమితమైన గుర్తింపు పొందిన పత్రిక. ఆపై రూపు మార్చుకుని ఫ్యాషన్ ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పత్రిక చరిత్రలో తొలిసారిగా హిజబ్ (హెడ్ స్కార్ఫ్) ధరించిన ఓ ముస్లిం మోడల్ ను ప్రచురించగా, అటు పొగడ్తలు, ఇటు తిట్లు వస్తున్నాయి. అక్టోబర్ మాసపు 'రెనిగేడ్స్' ఎడిషన్ లో 22 ఏళ్ల అమెరికన్ జర్నలిస్ట్ నూర్ తాగౌరీ, బ్లాక్ లెదర్ జాకెట్, జీన్స్, స్నీకర్స్ తో పాటు హిజబ్ ధరించిన చిత్రాన్ని ప్రచురిస్తూ, ఆమెను 'బదాస్ యాక్టివిస్ట్' అని సంబోధించింది. లిబియా నుంచి వచ్చిన నూర్ ఏకైక లక్ష్యం, యూఎస్ కమర్షియల్ టెలివిజన్ రంగంలో హిజబ్ ధరించి యాంకరింగ్ చేసిన తొలి యాంకర్ గా నిలవడమేనట. ఇక ప్లేబాయ్ యాజమాన్యం పత్రికను అశ్లీలతకు కాస్తంత దూరం చేసిన తరువాత, ఇటువంటి ఫోటోను ప్రచురించడం, యువతలో, ముఖ్యంగా జీవితంలో ఎదగాలనుకునే ముస్లిం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని పలువురు వ్యాఖ్యానిస్తుండగా, ముస్లిం వర్గాలు మాత్రం మండిపడుతున్నాయి. ప్లేబాయ్ అంటేనే శృంగారం, అశ్లీలం, అసభ్యమని ఆన్ లైన్ మేగజైన్ 'ది ముస్లిం వైబ్' వ్యాఖ్యానించింది.