: ధోనీతో డేటింగ్ చేశా.. కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు: హీరోయిన్ రాయ్ లక్ష్మి
టీమిండియా సారథి మహేంద్రసింగ్ ధోనీతో డేటింగ్ చేసింది నిజమే కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని దక్షిణాది తార రాయ్‌లక్ష్మి పేర్కొంది. ప్రస్తుతం రాయ్‌లక్ష్మి వ్యవహారం ముంబై మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ధోనీ జీవిత కథ ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ద అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ధోనీ, రాయ్ లక్ష్మి మధ్య నడిచిన వ్యవహారం ఈ సినిమాలో ఉంటుందా? లేదా? అన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆ జట్టుకు ఈ సౌత్ హీరోయిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు ఊహాగానాలకు కారణమైంది. ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి సినిమా ట్రైలర్‌లో ప్రస్తావించడంతో రాయ్‌లక్ష్మి పాత్ర కూడా ఉండే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఊహాగానాలపై స్పందించిన రాయ్ లక్ష్మి మాట్లాడుతూ గతాన్ని గుర్తు చేయడం సబబు కాదంటూ పేర్కొంది. ‘‘మా ఇద్దరి రిలేషన్ వయసు ఏడాది కంటే తక్కువే. ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో విడిపోయాం. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ముగిసిన అధ్యాయం. ఇప్పుడైతే అతడితో టచ్‌లో లేను. అయినా ధోనీ నా తర్వాత ఎందరితోనో డేటింగ్ చేశాడు. ఆ జాబితా చాలా పెద్దది. జీవిత కథ అంటే అమ్మాయిలే కాదు.. ధోనీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపిస్తారని అనుకుంటున్నా. ఆ సినిమాలో నా ప్రస్తావన ఉండదనే అనుకుంటున్నా. నా నుంచి ఆ విషయాన్ని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. ఇక నుంచి ఎవరైనా నన్ను ధోనీ గురించి అడిగితే క్రికెటర్‌గానే తెలుసు. వ్యక్తిగతంగా పరిచయం లేదు అని చెబుతా’’ అని రాయ్‌లక్ష్మి వివరించింది. రాయ్‌లక్ష్మి హిందీలో హీరోయిన్‌గా నటించిన ‘జూలీ2’ త్వరలో విడుదల కానుంది.