: ఏపీలో నెత్తురోడిన రోడ్లు... ఐదుగురి మృతి
ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కల్లూరు మండలం ఉలిందకొండ వద్ద వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను అనంతపురం వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక మండలం ఉక్కు నగరంలో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వాసులుగా గుర్తించారు.