: పోలవరం పనులు 40 శాతం పూర్తయ్యాయి.. కేంద్రానికి ఏపీ నివేదిక


బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరం పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్టు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఉద్దేశం, ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఖర్చులు, తుది గడువు తదితర వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ప్రాజెక్టును మార్చి, 2018 నాటికి పూర్తిచేయనున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇంకా ఆ రిపోర్టులోని కొన్ని అంశాలు.. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ, గిరిజన తదితర ఎనిమిది చట్టబద్ధ అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అలాగే 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. విశాఖపట్నంలోని 28.5 లక్షల మందికి తాగునీరు అందించడమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలు కూడా వరుసగా 21, 14 టీఎంసీల నీటిని పొందుతాయి. 2454 మీటర్ల పొడవైన డ్యామ్‌లో 1128.40 మీటర్ల గేట్ల పొడవు, 25.72 మీటర్ల ఎత్తైన 48 గేట్లు ఉంటాయి. 50 లక్షల క్యూసెక్కుల వరదను సైతం ప్రాజెక్టు తట్టుకుంటుంది. 75.20 టీఎంసీల నీటిని ప్రాజెక్టు జలాశయం నిల్వచేయగలదు. విశాఖపట్నం వరకు వెళ్లే ఎడమ కాలువకు 10,661.77 ఎకరాలు అవసరం కాగా 97.34 శాతం భూసేకరణ పూర్తయింది. అలాగే 60 శాతం పనులు పూర్తయ్యాయి. కృష్ణానది వరకు వెళ్లే కుడి కాలువ పొడవు 177.90 కిలోమీటర్లు. దీనికి మొత్తం 12,251.77 ఎకరాలు అవసరం కాగా భూసేకరణ పూర్తయింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. 2010-11 ధరల ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం 16,010.45 కోట్లు కాగా ఈ ఆగస్టు నాటికి రూ.8391.86 కోట్లు ఖర్చయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.2,843 కోట్లు ఖర్చయ్యాయి. కేంద్రం ఇంకా రూ.1893.07 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. జలాశయం సహా ప్రాజెక్టు కోసం ఇంకా 1,00,593.90 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టుతో ముంపు 1,87,187 మంది జనాభాపై ప్రభావం చూపనుంది.

  • Loading...

More Telugu News