: ల‌డ్డూలు పాచిపోవ‌చ్చు.. కానీ, డ‌బ్బులు పాచిపోవు: వెంక‌య్య‌ నాయుడు


రాష్ట్ర విభ‌జ‌న స‌మయంలో ఆనాడు రాష్ట్ర‌ ప్ర‌యోజ‌నాల‌పై నోరు మెద‌ప‌ని వారు ఈరోజు త‌మ‌ను విమ‌ర్శిస్తున్నార‌ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు గుంటూరులోని తెనాలిలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆదాయం లేక‌పోతే ఏపీ వెనుక‌బ‌డిపోతుంద‌ని విభజన సమయంలో తాను రాజ్య‌స‌భ‌లో చెప్పాన‌ని అన్నారు. ‘ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడిగింది నేనే.. ఒప్పుకుంటున్నా’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను అడిగిన ఎన్నో అంశాలను కాంగ్రెస్‌ బిల్లులో పెట్ట‌లేద‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. ‘ల‌డ్డూలు పాచి పోవ‌చ్చు.. కానీ, డ‌బ్బులు పాచి పోవు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుని కొంద‌రు పాచిపోయిన లడ్డూ అంటున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. హోదా అనే ఒక పదాన్ని ప‌ట్టుకొని మాకు అదే కావాల‌ని మాట్లాడుతున్నారు. హోదాకు త‌గిన విధంగానే ప్రత్యేక సాయం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేసినా అవే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామ‌ని, ఆ డ‌బ్బంతా మ‌ళ్లీ కేంద్ర‌మే క‌డుతుందన‌ని స్ప‌ష్టంగా చెప్పింది. 'మాక‌వ‌న్నీ వ‌ద్దు' అంటూ 'మాకు హోదానే ఇవ్వండి' అంటూ మాట్లాడుతున్నారు. పోల‌వ‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధులను 60 శాతం రాష్ట్రం, 40 శాతం కేంద్ర పెట్టుకోవాలి. హోదా వ‌స్తే 90 శాతం కేంద్రం భరిస్తుంది. కానీ, ప్ర‌త్యేక సాయాన్ని ప్ర‌క‌టించిన కేంద్రం ఇప్పుడు పోల‌వ‌రానికి అవ‌స‌ర‌మయ్యే 100 శాతం నిధుల‌ని ఖ‌ర్చుపెడుతుంది’ అని వెంక‌య్య‌నాయుడు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News