: ఇక రైళ్ల ద్వారా నీరు అక్కర్లేదు... ఐదేళ్లకు సరిపడా నీటిని ఒడిసి పట్టిన మరాఠ్వాడ
గడచిన వేసవిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ చుక్క నీరు లభించని వేళ, మరాఠ్వాడా రీజియన్ లోని లాతూర్ ప్రాంతానికి రైళ్లలో నీటిని తరలించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రైళ్లలో నీటి తరలింపుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కూడా. ఇక లాతూరు ప్రాంతానికి మరో ఐదేళ్ల పాటు నీటితో నిండిన రైలు రానవసరం లేదు. ఈ వర్షాకాల సీజనులో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతమంతా తడిసి ముద్దవగా, అతిపెద్ద మంజ్రా జలాశయం సహా, చిన్నాపెద్ద రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. ఇప్పుడున్న నీటితో ఐదేళ్లపాటు లాతూర్ ప్రాంతంలో నీటి అవసరాలను తీర్చవచ్చని అధికారులు తెలిపారు. 2012 నుంచి చుక్క నీరు లేకుండా డెడ్ స్టోరేజ్ లో ఉన్న మంజ్రా రిజర్వాయర్ లో ఇప్పుడు 97 శాతం నీరు నిండివుందని వివరించారు. సెకనుకు 5,190 క్యూబిక్ ఫీట్ నీటిని వదులుతున్నామని, ఈ ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలోని క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు మరింత నీరు రానుందని పేర్కొన్నారు. మంజ్రాతో పాటు మరో పెద్ద రిజర్వాయర్ అయిన లోయర్ తెర్నాతో పాటు ఎనిమిది చిన్న, మధ్యతరహా రిజర్వాయర్లూ నిండుకుండలా మారినట్టు అధికారులు తెలిపారు.