: హమ్మయ్య!.. తెలంగాణలో తగ్గిన వర్షాలు.. ఊపిరి పీల్చుకుంటున్న జనం


వారం పదిరోజుల నుంచి కుండపోతగా కురిసిన వానలు కాస్తంత తెరిపినివ్వడంతో తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆదివారం వరకు కుమ్మేసిన వర్షం సోమవారం కాస్త తెరిపినిచ్చింది. అయితే ఈరోజు(మంగళవారం) తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం, బుధవారం నుంచి మాత్రం మూడు రోజులపాటు భారీ వర్షాలకు అవకాశం లేదని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ నుంచి విదర్భ మీదుగా మధ్య భారతం వైపు వెళ్లి బలహీనపడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకేరెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాల కదలికలు మందగించాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరానికి దూరంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది కాస్త బలపడితే శుక్రవారం నుంచి తిరిగి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. కాగా వారం క్రితం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News