: ‘ప్రత్యేక హోదా’ సమావేశాలకు వెళ్తే జైలుకు వెళ్లడం నేర్పిస్తారు.. జగన్పై చంద్రబాబు సెటైర్
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాపై పెట్టే సమావేశాలకు వెళ్తే ఆయనలా జైలుకు వెళ్లడం నేర్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ విద్యార్థులతో తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్న వారికి కూడా పిల్లలు ఉండే అవకాశం ఉంది. వారిని బుద్ధిగా కళాశాలలకు వెళ్లి చదువుకుని రమ్మనండి. మీటింగ్లు, చాటింగ్లు అంటూ జగన్ పెట్టే సమావేశాలకు వెళ్తే వారికి జైలుకు వెళ్లడం ఎలాగో నేర్పిస్తారు. ప్రత్యేక హోదా అంటూ ఆయన పెట్టే సమావేశాలకు వెళ్తే వారు కూడా జైలుకు వెళ్తారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అని అందరూ గళమెత్తుతున్నారని, కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మాత్రం చెప్పలేక నీళ్లు నములుతున్నారని అన్నారు. తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.