: ‘పోలవరం’లో ఒక్క తప్పటడుగు కూడా వేయద్దు.. మిగిలింది 27 నెలలే: ఏపీ సీఎం చంద్రబాబు
పోలవరం లాంటి ప్రాజెక్టును సమీప భవిష్యత్తులో ఎవరూ చేపట్టే అవకాశమే లేదని, ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని నిబద్ధతతో పనిచేయాలని ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఆరు సంస్థలకు సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం నిర్మాణానికి మిగిలింది ఇక 27 నెలలేనని పేర్కొన్న ఆయన గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రాజెక్టు పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు విషయాలు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాని నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. నాణ్యత నుంచి సాంకేతిక విషయాల వరకు ఎక్కడా రాజీపడవద్దని సూచించారు. నిర్మాణంలో ఒక్క తప్పటడుగు కూడా పడేందుకు వీలు లేదన్నారు. ఈ ప్రాజెక్టును జాతీయ సమగ్రతకు ప్రతిరూపంగా వర్ణించిన చంద్రబాబు, పోలవరం పూర్తయితే ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో జాప్యం తగదని సూచించిన సీఎం కేంద్రం కోరినన్ని నిధులు ఇచ్చేందుకు నాబార్డు సంసిద్ధతను వ్యక్తం చేసిందని తెలిపారు. సీఎం సమీక్షకు కొద్దిసేపటి ముందు రూ.800 కోట్ల నిధులు ఇచ్చేందుకు ‘నాబార్డు’ అంగీకరించిందన్న సమాచారం అందడంతో విషయాన్ని సమీక్షలో తెలిపారు. దీంతో సమావేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.