: పాకిస్థాన్ కు సూటిగా, చెంప ఛెళ్లుమనేలా సమాధానమిచ్చిన సుష్మా స్వరాజ్
జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, ఎంత కాలమైనా భారత్ లో అది అంతర్భాగంగానే ఉంటుందని పాకిస్థాన్ కు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూటిగా, చెంపదెబ్బ కొట్టేలా సమాధానం చెప్పారు. న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితిలో ఆమె మాట్లాడుతూ, గాజుమేడలో ఉండి రాళ్లు విసిరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పాకిస్థాన్ కు హితవు పలికారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గత సమావేశాల్లో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారని ఆమె గుర్తు చేశారు. 'ఆయనను సూటిగా అడుగుతున్నా. బలూచిస్థాన్ లో ఏం జరుగుతోంది? సాక్ష్యాలు ప్రపంచానికి చూపించాలా?' అని ఆమె తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. 'భారత్ షరతులు పెడుతోందని, చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదని పాకిస్థాన్ పదేపదే ఆరోపిస్తోంది. లాహోర్ నుంచి నవాజ్ షరీఫ్ భారత్ కు రావడానికి ఏ షరతులు పెట్టామో వెల్లడించాలి' అని ఆమె సవాల్ విసిరారు. భారత్ లో కూర్చుని చర్చించినప్పుడు ఏ షరతులతో చర్చించామో చెప్పాలని ఆమె నిలదీశారు. భారత్ ఎప్పుడు స్నేహహస్తం చాచినా పాకిస్థాన్ కుటిలబుద్ధిని బయటపెట్టుకుంటోందని ఆమె మండిపడ్డారు. మోదీ ఏ షరతులు పెట్టి లాహోర్ వచ్చారని ఆమె నిలదీశారు. ఏ షరతులుపెట్టి గతంలో క్రికెట్ ఆడామని ఆమె అడిగారు. ఏ షరతులతో గత ఒప్పందాలను గౌరవిస్తున్నామని ఆమె కడిగిపడేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం కారణంగా ప్రపంచానికి జరుగుతున్న నష్టాన్ని ఆమె ఐక్యరాజ్యసమితికి గుర్తు చేశారు. ఉగ్రవాదులను ఎవరు తయారు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలని ఆమె సూచించారు. ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు ఎవరిస్తున్నారు?, ఉగ్రవాదులకు నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? ఉగ్రవాదులను ఎవరు దాడులకు పురికొల్పుతున్నారు? ఉగ్రవాదులు అన్నెం, పున్నెం ఎరుగని అమాయకులను ఎందుకు పొట్టనపెట్టుకుంటున్నారు? దీని వెనుక ఉన్న స్వార్థ రాజకీయాలేంటి? అని ఆమె నిలదీశారు. కులం, మతం, ప్రాంతం, రంగు ఇలా తేడాలు లేకుండా ఉగ్రవాదులు ప్రపంచాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం ఏంటి? అని ఆమె ప్రపంచాన్ని ప్రశ్నించారు. తాను చెప్పే కొన్ని విషయాలు ఐక్యరాజ్యసమితిలో కొన్ని దేశాలకు నచ్చవని చెప్పిన ఆమె, ఉగ్రవాదులపై ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం ఏకమై వారిపై దాడులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. కొన్ని దేశాలకు నచ్చినా, నచ్చకపోయినా ఇందులో భాగస్వామ్యం కావాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై ప్రపంచ దేశాలు ఏకమై పోరాడడమన్నది అసాధ్యం కాదని, సాధ్యమేనని ఆమె సూచించారు. కాకపోతే ఇందుకు చిత్తశుద్ధి అవసరమని ఆమె తెలిపారు. అలా చేయకపోతే ప్రపంచం తీవ్రంగా నష్టపోతుందని ఆమె హెచ్చరించారు. ఉగ్రవాదులపై దాడులకు ఏ దేశమైనా అంగీకరించకపోతే దానిని ఏకాకిని చేయాల్సిన తరుణమిదేనని ఆమె సూచించారు. అలాంటి దేశాన్ని ఉగ్రదేశంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ దేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తుంది కనుక వారిపై దాడులకు అంగీకరించదని, ఇతర దేశాలపై దాడులకు చేసేందుకు ఆ దేశం ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు సమకూరుస్తుందని, అనంతరం ప్రపంచంపైకి వారిని దాడులకు పురికొల్పుతుందని ఆమె అన్నారు. అలాంటి దేశానికి ప్రపంచంలో ఎక్కడా స్థానం లేకుండా చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 'పాకిస్థాన్ ప్రధాని కి చెబుతున్నా... యూరీ సెక్టార్ లో జరిగినది ఏంటి? మా ఆర్మీకి సజీవంగా పట్టుబడిన బహదూర్ అలీ ఘటనలో ఏం జరిగింది? అందుకు సంబంధించి సజీవ సాక్ష్యాలున్నాయి. ప్రపంచానికి చూపేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధమే' అని ఆమె స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఇలాంటి ఘటనలు చేస్తూ, బెదిరింపులకు దిగుతూ ఏదో చేద్దామని ప్రయత్నిస్తే.... చూస్తూ ఊరుకుంటున్నామనుకుంటున్నారని ఆమె హెచ్చరించారు. 'చివరగా పాకిస్థాన్ కు చెబుతున్నా... కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం...అది ఎప్పటికీ భారత్ దే...భారత్ లోనే ఉంటుంది' అని ఆమె స్పష్టం చేశారు.