: రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కొనసాగాలంటే రాజకీయాలు పక్కనపెట్టాల్సిందే: పాక్ కెప్టెన్ మిస్బా


భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు కొనసాగాలంటే రాజకీయాలు పక్కనపెట్టాల్సిందేనని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ అన్నాడు. యూరీ సెక్టార్ ఘటన అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ భవిష్యత్ లో పాకిస్థాన్ తో భారత్ ఆడేది లేదని ప్రకటించిన నేపథ్యంంలో కరాచీలో మిస్బా మాట్లాడుతూ, ఒక ఆటగాడిగా భారత్ తో ఆడడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. రాజకీయాలను, క్రికెట్ ను విడివిడిగా చూడాలని, లేకపోతే క్రికెట్ సంబంధాలు కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు. 2007 నుంచి భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదని, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉందని, భారత్ మాత్రం స్పందించడం లేదని నిందలేశాడు. కాగా, 2010లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ చేపట్టిన మిస్బావుల్ హక్ భారత్ తో జరిగిన వన్డే మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వరల్డ్ కప్ లో ఈ రెండు దేశాలు తలపడిన సంగతి, టీ20లకు అఫ్రిదీ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే టెస్టుల్లో మాత్రం ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాత్రం పాల్గొనడం లేదు. దీంతో పాక్ క్రికెట్ కు ఎంతో నష్టం జరుగుతోంది. భారత్ తో జరిగే మ్యాచ్ లకు విపరీతమైన ఆర్థికలావాదేవీలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా బోర్డులు భారత్ తో ఆడేందుకు చాలా ఆసక్తి చూపుతాయి. పాకిస్థాన్ తో ఆడేందుకు బీసీసీఐ ఎలాంటి ఆసక్తి చూపకపోవడంతో పీసీబీ భారీగా నష్టపోతోంది. దేశవాళీ ఆటగాళ్లకు కాంట్రాక్టు డబ్బులిచ్చేందుకు కూడా ఇబ్బందిగా ఉందని ఆ మధ్య కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ జట్టు కెప్టెన్ కొత్త ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News