: ట్విట్టర్ తమకు వద్దే వద్దన్న మైక్రోసాఫ్ట్!
సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ అమ్మకానికి ఉందన్న వార్తల నేపథ్యంలో, గూగుల్, యాహూ మాతృసంస్థ వేరీజోన్, మైక్రోసాఫ్ట్ లు పోటీ పడతాయని, త్వరలోనే ఈ సంస్థలు బిడ్లు దాఖలు చేస్తాయని భావిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఆలోచనను ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఇటీవలే 26.6 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 1.78 లక్షల కోట్లు) లింక్డ్ ఇన్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే మరో భారీ డీల్ ఇప్పట్లో వద్దని భావిస్తున్నందునే టెక్నాలజీ దిగ్గజం ఈ డీల్ నుంచి తప్పుకుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో ట్విట్టర్ కు మంచి పేరున్నప్పటికీ, సెలబ్రిటీల నుంచి ట్వీట్ల తాకిడి, నెటిజన్ల ఫాలోయింగ్ అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం సంస్థ భారీ లాభాలను నమోదు చేయడంలో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇక మైక్రోసాఫ్ట్ తప్పుకోవడంతో గూగుల్, వేరీజోన్ ల మధ్య ట్విట్టర్ కోసం పోటీ గట్టిగా ఉంటుందని అంచనా.