: 'హిందువులు ఫెంటాస్టిక్... ఎంతో చేస్తున్నారు' పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, వివిధ వర్గాల ప్రజలను మంచి చేసుకునేందుకు అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఎన్నోమార్లు భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టారని, వారి కారణంగానే దేశంలో నిరుద్యోగులు పెరిగారని ఆరోపణలు గుప్పించిన ఆయన, ఇప్పుడు హిందువులను మంచి చేసుకునేందుకు కదిలారు. హిందూ వర్గం ప్రజలు అమెరికాకు ఎంతో మేలు చేస్తున్నారని, వారి కృషి అత్యద్భుతమని కొనియాడారు. న్యూజర్సీలో వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ - అమెరికన్ ఈవెంట్ లో తాను ప్రసంగిస్తానని చెప్పుకొచ్చారు. హిందువులు అధికంగా శ్రమిస్తారని, వారిలో కుటుంబ విలువలు అమెరికన్ల కన్నా అధికమని పొగడుతూ, అమెరికా ఆర్థిక వృద్ధిలో హిందువుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. న్యూజర్సీలోని పీఎన్సీ ఆర్ట్స్ సెంటర్ లో జరిగే రిపబ్లికన్ హిందూ కూటమి ర్యాలీకి హిందువులంతా తరలి రావాలని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. "హలో ఎవ్రీవన్... న్యూజర్సీలో జరిగే రిపబ్లికన్ హిందూ కూటమి ర్యాలీకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వేలాది మంది ఇండియన్-అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడాలని నేనెంతో ఎదురు చూస్తున్నాను. మీరంతా అమెరికాను గొప్పగా నిలిపారు. ఓ అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించేందుకు అందరూ వస్తారని ఆశిస్తున్నాను" అని ట్రంప్ అన్నారు.