: సామాజిక, ఆర్థిక, సాధారణ సూచీల్లో కృష్ణా ఫస్ట్.. అనంత లాస్ట్
సామాజిక, ఆర్థిక, సాధారణ తదితర విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం రేటింగ్‌లు ఇచ్చింది. ఈనెల 28, 29వ తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఈ రేటింగ్స్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్స్‌లో కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ‘ఎ’ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు, కడప జిల్లాలు ‘బి’, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ‘సి’ రేటింగ్ దక్కింది. నిజానికి ‘ఎ’ రేటింగ్ దక్కించుకున్న కృష్ణా జిల్లా సాధారణ సూచీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ విభాగంలో ‘సి’ రేటింగ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే సామాజిక, ఆర్థిక సూచీల్లో ముందంజలో ఉండడంతో ‘ఎ’ రేటింగ్‌తో అగ్రస్థానం దక్కించుకోగలిగింది. సామాజిక, ఆర్థిక, సాధారణ సూచీల్లో పశ్చిమగోదావరి జిల్లా ‘ఏ’ రేటింగ్‌లో నిలిచినప్పటికీ మొత్తంగా కృష్ణా జిల్లా కంటే వెనకబడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక సామాజిక సూచీలో వెనకబడిన ప్రకాశం జిల్లా ‘బి’రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఆర్థిక సూచీలో నెల్లూరు జిల్లా ‘ఎ’ రేటింగ్ సాధించినప్పటికీ మిగిలిన సూచీల్లో ద్వితీయ స్థానానికి పరిమితం కావడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.