: ఒబామా సంతకంతో ఐడీ కార్డు పెట్టుకుని, సన్మానాలు చేయించుకుని అడ్డంగా బుక్కయిన యువకుడు
అన్సార్ ఖాన్... మధ్యప్రదేశ్ కు చెందిన 20 సంవత్సరాల యువకుడు. తనకు నాసాలో ఉద్యోగం వచ్చిందని, అందులోని 'స్పేస్ అండ్ ఫుడ్' కార్యక్రమంలో రూ. 1.85 కోట్ల వేతనంపై ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నాసా హెడ్ ఫిలిప్ డీ గోర్డాన్ సంతకాలు, నాసాలోగోతో ఓ ఐడీ కార్డును చూపాడు. అధికారులు నమ్మారు. అతనికి సన్మానాలు చేశారు. తాను అమెరికా వెళ్లిన తరువాత తిరిగిస్తానని చెప్పి పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. అతని గౌరవార్థం పలు ప్రాంతాల అధికారులు సభలు ఏర్పాటు చేయగా, అన్ని చోట్లకూ వెళ్లి ఎంజాయ్ చేశాడు. కమలాపూర్ అధికారులు అన్సార్ కు సన్మానం జరపాలని నిశ్చయించిన వేళ, అసలు విషయం బయటపడగా అడ్డంగా బుక్కయ్యాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన పోలీసు అధికారి శశికాంత్ శుక్లా, అన్సార్ ఖాన్ మెడలో ఉన్న ఐడీ కార్డును చూశారు. దానిపై ఒబామా సంతకం ఉండటమే అతనికి అనుమానం వచ్చేలా చేసింది. ఆ వెంటనే అన్సార్ పూర్వోత్తరాలు వెలికితీయాలని తన సిబ్బందికి చెప్పడం, వారు కదిలి అన్సారీ బాగోతాన్ని వెలుగులోకి తేవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఓ స్థానిక ఫోటో స్టూడియోలో ఫోటో దిగి ఒబామా సంతకం ఫోర్జరీ చేసి ఐడీ కార్డు తగిలించుకున్నాడు. అన్నట్టు అన్సారీకి అసలు పాస్ పోర్టు కూడా లేదు. చదివింది ఇంటర్ వరకూ మాత్రమేనట. నాసాలో చేరాడంటూ, అతను చదివిన స్కూలు నుంచి, ఎన్నో స్థానిక సంస్థల వరకూ అతనికి సన్మానాల మీద సన్మానాలు చేశాయి. ప్రస్తుతం అన్సార్ ఖాన్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.